'భర్తను ‘నల్లోడు’ అన్నా క్రూరత్వమే'

భార్య తన భర్తను ‘నల్లగా’ ఉన్నావని వేధించడం క్రూరత్వమేనని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది.

Update: 2023-08-08 16:36 GMT

బెంగళూరు: భార్య తన భర్తను ‘నల్లగా’ ఉన్నావని వేధించడం క్రూరత్వమేనని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు భర్తకు అక్రమ సంబంధాలను అంటగడుతూ ఆయనకు దూరంగా ఉండటం దారుణమని పేర్కొన్నది. విడాకుల కోసం భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను అలోక్ ఆరాధే, అనంత్ రామ్‌నాథ్ హెగ్డేలతో కూడిన ధర్మాసనం అనుమతించింది. తన చర్మం రంగును బట్టి తన భార్య అవమానిస్తోందంటూ, ఆమె నుంచి తనకు విడాకులు ఇవ్వాలంటూ భర్త 2012లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనను విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే భార్య ఆమె తల్లిదండ్రుల వద్దకెళ్లిందన్నాడు.

ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భార్య తన భర్త మరో మహిళతో వివాహేతన సంబంధం పెట్టుకున్నాడని, తనను శారీరకంగా వేధింపులకు గురి చేశాడని కేసు పెట్టింది. అయితే.. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న భార్య దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం సమర్పించలేదని హైకోర్టు పేర్కొన్నది. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఫ్యామిలీ కోర్టు భర్తకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని అభిప్రాయపడింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై భార్య ఇంకా కేసులను కొనసాగిస్తోందని గుర్తించింది. అయితే.. ఆ కేసులను ఉపసంహరించుకోవడానికి భార్య అంగీకరించకపోవడంతో వాళ్లిద్దరూ కలిసి ఉండే అవకాశం లేదని గుర్తించిన హైకోర్టు తన వివాహాన్ని రద్దు చేయాలన్న భర్త విజ్ఞప్తిని అంగీకరించి విడాకులు మంజూరు చేసింది.


Similar News