తూర్పు లడఖ్‌కు 68 వేల మంది సైన్యం ఎయిర్ లిఫ్ట్..

2020 సంవత్సరం మేలో భారత్‌కు చెందిన తూర్పు లడఖ్‌‌లోని గల్వాన్ లోయలో చొరబాట్లకు చైనా యత్నించింది.

Update: 2023-08-13 16:59 GMT

న్యూఢిల్లీ : 2020 సంవత్సరం మేలో భారత్‌కు చెందిన తూర్పు లడఖ్‌‌లోని గల్వాన్ లోయలో చొరబాట్లకు చైనా యత్నించింది. ఇది ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసింది. గల్వాన్ లోయకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో అప్పట్లో ముందుజాగ్రత్త చర్యగా పలు విడతల్లో 68,000 మందికిపైగా సైనికులను భారత ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ల ద్వారా చైనా బార్డర్‌కు తరలించింది. దాదాపు 90 యుద్ధ ట్యాంకులు, ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కూడా అప్పట్లో తూర్పు లడఖ్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు.

భారత రక్షణ శాఖ వర్గాలు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో.. ఆనాటి పరిణామాలు ఆలస్యంగా ప్రపంచానికి తెలిశాయి. సుఖోయ్ యుద్ధ విమానాలను, జాగ్వార్ జెట్‌లను కూడా నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంచిందని పేర్కొన్నాయి. ఇప్పుడు కూడా బార్డర్ వెంట వేలాది మంది భారత సైనికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చైనా-భారత్ మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. సైనిక ఘర్షణ జరిగిన పాయింట్ల నుంచి దళాలను త్వరగా ఉపసంహరించాలని ఈ మీటింగ్‌లో చైనాపై భారతదేశం ఒత్తిడి చేయనుంది.


Similar News