Omar Abdullah: జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం

జ‌మ్ముక‌శ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను ఇవ్వాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి మండ‌లి గురువారం తీర్మానం చేసింది.

Update: 2024-10-18 07:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జ‌మ్ముక‌శ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను ఇవ్వాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి మండ‌లి గురువారం తీర్మానం చేసింది. కేంద్ర పాలిత ప్రాంత సీఎంగా ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌మాణం చేసిన మ‌రుస‌టి రోజే మంత్రి మండ‌లి తీర్మానం చేసింది. ఒమ‌ర్ అబ్దుల్లా నాయ‌కత్వంలో గురువారం కేబినేట్ భేటీ జ‌రిగింది. కొత్త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలపై గురువారం రాత్రి వ‌ర‌కు ఆ స‌ర్కారు ఎటువంటి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. శ్రీన‌గ‌ర్‌లోని స‌చివాయంలో ఆ మీటింగ్ జ‌రిగింది. తీర్మానాన్ని ఏక‌ప‌క్షంగా ఆమోదించారు. జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ విష‌యంపై ప్ర‌ధాని మోడీతో చ‌ర్చించేందుకు సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఆ ప‌ర్య‌ట‌న‌లో తీర్మానాన్ని ఆయ‌న ప్ర‌ధానికి అంద‌జేయ‌నున్నారు.

మంత్రులకు శాఖల కేటాయింపు

ఇకపోతే, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రిమండలిలోకి చేరిన మంత్రలకు శాఖల కేటాయింపు జరిగింది. ముఖ్యమంత్రి సలహా మేరకు శాఖల కేటాయింపు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉప ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి ఆర్ అండ్ బీ, పరిశ్రమలు, వాణిజ్యం, మైనింగ్, కార్మిక – ఉపాధి – నైపుణ్య అభివృద్ధి బాధ్యతలను నిర్వహిస్తారు. ఇక ఏకైక మహిళా మంత్రి సాకినా మసూద్ కు ఆరోగ్య, విద్యా, సంక్షేమ శాఖలను అప్పగించారు. జావేద్ అహ్మద్ రాణాకు జలశక్తి, అటవీ, పర్యావరణ, గిరిజన వ్యవహారాల శాఖలు కేటాయించారు. జావేద్ అహ్మద్ దార్ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సహకార, ఎన్నికల మంత్రిగా వ్యవహరించనున్నారు. సతీష్ శర్మకు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, రవాణా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూత్ సర్వీసెస్, స్పోర్ట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇన్స్పెక్షన్, ట్రైనింగ్ అండ్ గ్రీవెన్సెస్ డిపార్ట్మెంట్ (ఏఆర్ఐ), ట్రైనింగ్ శాఖల బాధ్యతలు అప్పగించారు. ఏ మంత్రికీ కేటాయించని ఇతర విభాగాలు ముఖ్యమంత్రి వద్దనే ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Similar News