PM Modi: రాజకీయ దుమారం.. మహారాష్ట్ర పర్యటనలో క్షమాపణలు కోరిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు కోరారు.

Update: 2024-08-30 11:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో 35 అడుగుల చత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన రాజకీయ దుమారం రేగుతున్నది. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై క్షమాపణలు కోరారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే నాకు పేరు మాత్రమే కాదని ఆయన నా ఆరాధ్య దైవం అన్నారు. విగ్రహం కూలిపోయిన ఘటనలో నా దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు శిరస్సువంచి క్షమాపణలు చెబుతున్నారు. అంతే కాదు శివాజీని తమ దైవంగా భావించే వారు ఈ ఘటన వల్ల తీవ్ర వేదనకు గురయ్యారు. వారికి కూడా నా క్షమాపణలు. మనకు ఈ దైవం కంటే గొప్పది మరేమి లేదు'అని అన్నారు. ఇవాళ పాల్ఘర్ లో పర్యటించిన మోడీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అలాగే లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా మోడీ విమర్శలు గుప్పించారు. గతంలో వారు వీరసావర్క్ ను నిందించారు. కానీ వారు ఇప్పటి వరకు క్షమాపణలు కోరలేదని దుయ్యబట్టారు.

కాగా రూ.2.36 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర ప్రభుత్వం శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. గతేడాది ఆగస్టు 26న నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ఈ విగ్రహం కూలిపోయింది. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగానే ఈ విగ్రహం కూలినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ ఈ ఘటనపై పై విధంగా స్పందించారు. కాగా వచ్చే ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసకందాయంగా మారుతున్నది. 


Similar News