అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

అమెరికాలో మరో భారత విద్యార్థి మరణించాడు. గత నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ ఆర్ఫాత్(25) యూఎస్‌లోని క్వీన్‌ల్యాండ్ నగరంలో శవమై కనిపించాడు.

Update: 2024-04-09 04:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరో భారత విద్యార్థి మరణించాడు. గత నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ ఆర్ఫాత్(25) యూఎస్‌లోని క్వీన్‌ల్యాండ్ నగరంలో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ‘ఇటీవల అదృశ్యమైన విద్యార్థి అర్ఫాత్ మరణించడం బాధాకరం. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అని ఎక్స్ వేదికగా పేర్కొంది. ఆర్ఫాత్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని, వీలైనంత త్వరగా మృత దేహాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సాయం అందిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరిగేలా చొరవ తీసుకుంటామని వెల్లడించింది.

కాగా, హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ క్వీన్ లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివేందుకు గతేడాది మేలో అమెరికాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే గత నెల 7నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అనంతరం 19వ తేదీన అర్ఫాత్ తండ్రికి ఓ కాల్ వచ్చింది. అర్ఫాత్‌ను కిడ్నాప్ చేశామని, విడుదల చేయాలంటే 1,200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే అర్ఫాత్ శవమై కనిపించాడు. దీంతో ఈ ఏడాది యూఎస్‌లో మరణించిన భారతీయుల సంఖ్య 11కి చేరుకుంది. గత వారం ఒహియోలో ఉమా సత్య సాయి గద్దె అనే భారతీయ విద్యార్థి మరణించాడు. అతరి మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగానే మరో విద్యార్థి మరణించడం గమనార్హం. భారత విద్యార్థుల వరుస మరణాలతో ఆందోళనలు నెలకొన్నాయి. అక్కడున్న మిగతా విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News