'లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకుంటే తప్పుకాదు'

లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం, ముట్టుకోవడం నేరం కాదని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ తరఫు న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ అన్నారు.

Update: 2023-08-09 16:30 GMT

న్యూఢిల్లీ : లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం, ముట్టుకోవడం నేరం కాదని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ తరఫు న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఢిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు ఆయన ఈమేరకు వాదన వినిపించారు.

మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌తోపాటు మరో నిందితుడు వినోద్‌ తోమర్‌పై అభియోగాలు మోపాలా..? వద్దా..? అనే అంశంపై ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఫిర్యాదుదారు సుదీర్ఘ కాలం తర్వాత బ్రిజ్ భూషణ్‌ పై ఆరోపణలు చేశారని న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ అన్నారు. అన్ని రోజులు స్వేచ్ఛగా తిరిగి, ఐదేళ్లలో ముందుకు రాకుండా.. ఇప్పుడు ముప్పు ఉందని చెప్పడం సరైన వివరణ కాదని వాదించారు.

"ఆరోపణల విషయానికొస్తే.. ఇందులో కొన్ని భారత్‌ వెలుపల జరిగాయి. 3 కేసులు మాత్రమే భారత కోర్టుల పరిధిలోకి వస్తాయి. అందులో రెండు అశోకా రోడ్‌, మరొకటి సిరి ఫోర్ట్‌కు సంబంధించినవి. సిరి ఫోర్ట్‌ కేసు కేవలం కౌగిలింతకు సంబంధించింది. లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం, ముట్టుకోవడం నేరం కాదు" అని బ్రిజ్‌ భూషణ్‌ తరఫు న్యాయవాది చెప్పారు. "ఏదైనా విజయం సాధించిన సందర్భంలో ఆటగాళ్లను కౌగిలించుకుంటే.. అది నేరం కిందకు రాదు. ఉత్సాహంతో ఆలింగనం చేసుకోవడం నేరం కాదు" అని వివరణ ఇచ్చారు. ఈ కేసుపై గురువారం (ఆగస్టు 10న) కూడా వాదనలు జరగనున్నాయి.


Similar News