రీ కౌంటింగ్ నిర్వహించండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చండీగఢ్ మేయర్ ఎన్నికపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తిరస్కరించిన 8 బ్యాలెట్ పేపర్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

Update: 2024-02-20 10:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చండీగఢ్ మేయర్ ఎన్నికపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తిరస్కరించిన 8 బ్యాలెట్ పేపర్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఓట్లను మళ్లీ లెక్కించి మేయర్‌ను ఎన్నుకోవాలని ఆదేశించింది. మంగళవారం విచారణ ప్రారంభమైన వెంటనే ఎన్నికల్లో తిరస్కరించిన 8 బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సందర్భంగా జరిగిన వీడియోలను సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ప్రిసైడింగ్ అధికారి మనీహ్ సైతం కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. బ్యాలెట్ పేపర్లు చెల్లుతాయని వాటి ద్వారానే ఫలితాలు వెల్లడించాలని తెలిపింది. అయితే కోర్టు విచారణలో ఉండగానే మేయర్ పదవికి మనోజ్ సోంకర్ రాజీనామా చేశారు. దీనిపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. కష్టసమయాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడినందున సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

కేసు నేపథ్యం

గత నెల 30న చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఆప్, కాంగ్రెస్ కూటమి కలిసి అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ ఒంటరిగానే తన అభ్యర్థిని బరిలో నిలిపింది. అయితే ఎన్నికల రోజున మొత్తం 36 ఓట్లకు 35 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. పోలింగ్ అనంతరం ప్రిసైండింగ్ అధికారి ఫలితాను ప్రకటించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఆప్ కూటమికి 12ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే ప్రిసైడింగ్ అధికారి 8 ఓట్లను చెల్లవని ప్రకటించారు. దీనిపై ఆప్, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ఓట్లను కావాలనే చెల్లకుండా చేశారని ఆరోపించాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం విచారణ చేపట్టింది. 

Tags:    

Similar News