Heavy rains: సిక్కింలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిక్కిం అతాలకుతలం అవుతుంది.
దిశ, నేషనల్ బ్యూరో: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిక్కిం అతాలకుతలం అవుతుంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీ చాలా వరకు దెబ్బతింది. సిక్కిం ఉత్తర భాగానికి గేట్‌వేగా పరిగణించబడుతున్న రంగ్-రాంగ్ వంతెన దెబ్బతింది. దీంతో మంగన్ జిల్లా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడే శంఖలాంగ్ వంతెన, గత సంవత్సరం దెబ్బతినగా, ఇప్పుడు ఆ దారి కూడా మూసివేసి ఉంది. కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
జాతీయ రహదారి 10 వెంబడి కొండచరియలు పడటంతో అటుగా ప్రయాణిస్తున్న పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్‌ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. మరోవైపు, సిక్కింలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే వరకు అనవసర రాకపోకలకు దూరంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అత్యవసరం అయితే అధికారులను సంప్రదించాలని సూచించింది.