మొదటి దశలో అత్యంత ధనవంతుడు ఆయనే?

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా.. దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.

Update: 2024-04-10 05:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా.. దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొత్తంగా 1618 మంది అభ్యర్థులు మొదటి విడత బరిలో నిలిచారు. అయితే ఇందులో అత్యంత ధనవంతమైన పది మంది అభ్యర్థుల జాబితాను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ధనవంతుడిగా మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్‌ కుమారుడు నకుల్ నాథ్ నిలిచారు. ఆయనకు 717కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇక, రెండో స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే నేత అశోక్ కుమార్ ఉన్నారు. ఆయన ఆస్తులు రూ. 662కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. మూడో స్థానంలో తమిళనాడులోని శివగంగ నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి దేవనాధన్ యాదవ్ ఉండగా..ఆయన ఆస్తులు రూ. 304కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తదుపరి స్థానంలో ఉత్తరాఖండ్ లోని తెహ్రీగర్వాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాల రాజ్యలక్ష్మీ షా ఉన్నారు. ఆమె ఆస్తులు 206కోట్లు ఉన్నాయి. ఐదో ప్లేసులో ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న మజీద్ అలీ ఉండగా ఆయన ఆస్తులు 159 కోట్లుగా ప్రకటించారు. ఈ పది మందిలో తమిళనాడు నుంచి బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు ఉండటం గమనార్హం.

Tags:    

Similar News