Kolkata Rape-Murder Case: అతడ్ని ఏమైనా చేసుకోండి.. ఉరితీసినా పర్వాలేదు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అతడి అత్త దుర్గా దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-20 04:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అతడి అత్త దుర్గా దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు సంజయ్ రాయ్ తన కుమార్తెతో వ్యవహరించిన విధానాన్ని గురించి ఆవేదన వ్యక్తం చేసింది. అతణ్ని ఏం చేసినా ఫర్వాలేదని.. ఉరితీసినా సరేనని అన్నారు. సంజయ్ రాయ్ తన కుమార్తెను కొట్టాడని.. దీనిపై పోలీసు కేసు నమోదైందని తెలిపారు. "అతనితో మా సంబంధాలు చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి ఆరు నెలలు అంతా బాగానే ఉంది. నా కుమార్తె 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను కొట్టాడు. దీంతో నా కుమార్తెకు గర్భస్రావం జరిగింది. దీనిపై కేసు కూడా నమోదైంది. అప్పట్నుంచి ఆమె అనారోగ్యంగానే ఉంటోంది. ఆమె మందుల ఖర్చులన్నీ నేనే భరించాను” అని దుర్గా దేవి అన్నారు. "సంజయ్ మంచివాడు కాదు. అతన్ని ఉరితీయండి లేదా అతన్ని ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. నేను నేరం గురించి మాట్లాడలేను. అతను ఒంటరిగా అయితే ఈ నేరం చేయలేడు" అని ఆమె చెప్పింది.

సుప్రీంకోర్టులో విచారణ

ఇకపోతే, కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ దారుణ కేసును సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుని విచారించనుంది. అరెస్టయిన నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అనుమతి లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, జనవరి 2021 నుంచి ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్ని ఆరోపణలపై విచారణ జరిపేందుకు బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.


Similar News