రూ.200 కోట్లు దానం చేసి సన్యాసంలోకి..
గుజరాత్‌కి చెందిన దంపతులు తీసుకున్న నిర్ణయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమకు ఉన్న రూ.200కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. జైన సన్యాసులుగా మారేందుకు డిసైడ్ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌కి చెందిన దంపతులు తీసుకున్న నిర్ణయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమకు ఉన్న రూ.200కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. జైన సన్యాసులుగా మారేందుకు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం మోక్షం కోసం యాత్రకు బయల్దేరాలని ఆలోచిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో భవేశ్ బండారి, అతడి భార్య సంపదనంతా వదిలిపెట్టి సన్యాసులుగా మారుతున్నట్లు ప్రకటించారు.
హిమ్మత్ నగర్‌కి చెందిన భవేష్ బండారి నిర్మాణరంగ వ్యాపారంలో ఉన్నారు. తమ పిల్లల అడుగుజాడల్లో నడుస్తామని.. అందుకే సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భవేష్ భాయ్ భండారీ 19 ఏళ్ల కుమారుడు విశ్వ, 16 ఏళ్ల కుమార్తె భవ్య 2021లో జైన సన్యాసులుగా మారారు. వీరి నుంచి ప్రేరణ పొందితూ తాము కూడా సన్యాసాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. భౌతిక సంబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. ఏప్రిల్ 22న ఈ మేరకు ప్రతిక్ష తీసుకోనున్నారు. అన్ని కుటుంబ సంబంధాలను తెంచుకుని, భౌతిక వస్తువులకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ తీసుకుంటారు. దేశమంతటా చెప్పులు లేకుండా యాత్ర చేస్తూ, భిక్షతో మాత్రమే జీవించనున్నారు. కేవలం రెండు జతల తెల్లటి వస్త్రాలు, భిక్ష కోసం ఒక గిన్నెను మాత్రమే తమవెంట తీసుకెళ్తారు.
అపారమైన సంపద కలిగిన బండారి ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బండారి దంపతులు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వారు తమ మొబైల్ ఫోన్లను, ఏపీలతో సహా తమ ఆస్తులన్నింటిని విరాళంగా ఇచ్చారు.
జైనమతంలో దీక్ష తీసుకోవడం అనేది ముఖ్యమైన ఆచారం. ఇది వ్యక్తిని భౌతిక సుఖాలకు దూరం చేస్తుంది. గతేడాది గుజరాత్‌లోని వజ్రాల వ్యాపారి, అతని భార్య, 12 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించారు. 2017లో మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ ధనవంతుల కుటుంబం రూ.100 కోట్లను విరాళంగా ఇచ్చేసి, తమ మూడేళ్ల కుమార్తెను వదిలి సన్యాసులుగా మారారు. సుమిత్ రాథోడ్(35), అతని భార్య అనామిక(34) తమ కుమార్తెను వారి తాతయ్య, నానమ్మ దగ్గర వదిలపెట్టి సన్యాసులుగా మారారు. గుజరాత్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఆ మూడేళ్ల చిన్నారి గురించి దంపతులు తీసుకున్న చర్యల గురించి పోలీసుల నుంచి నివేదికను సైతం కోరింది.