ఎల్ఏసీ వద్ద యథాతథ స్థితి కొనసాగించడంలో ప్రభుత్వం విఫలం: మల్లికార్జున్ ఖర్గే

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద యథాతథ స్థితిని కొనసాగించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

Update: 2024-07-07 18:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద యథాతథ స్థితిని కొనసాగించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. సైనికులు ప్రాణత్యాగం చేసిన గాల్వాన్‌పై ప్రధాని ఇచ్చిన క్లీన్ చిట్ 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పటికీ, చైనా మన ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తూనే ఉందని తెలిపారు. ఏప్రిల్ 10న విదేశీ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ప్రపంచ వేదికపై భారత్ వాదనను బలంగా వినిపించడంలో విఫలమయ్యారన్నారు.

భారత భూమిని చైనా అంగుళం కూడా ఆక్రమించలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటన ప్రభుత్వ మెతక విధానాన్ని బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ‘చైనా మన భూభాగాన్ని ఆక్రమించడం, సిరిజాప్‌లో సైనిక స్థావరాన్ని నిర్మించడంపై పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇది ఇండియా ఆధీనంలో ఉన్న భూమి. ఎల్ఏసీ వద్ద యథాతథ స్థితిని కొనసాగించకపోవడానికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికే డెప్సాంగ్ ప్లెయిన్స్, డెమ్‌చోక్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలోని పాయింట్లతో సహా 65లో 26 పెట్రోలింగ్ పాయింట్‌లను కోల్పోయాం’ అని తెలిపారు. సైనికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.


Similar News