ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. తద్వారా పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదలకు ఆయన పచ్చజెండా ఊపారు. దీంతో పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున దాదాపు 20వేల కోట్ల రూపాయలు జమకానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైల్‌పై తొలి సంతకాన్ని చేశానని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల జీవితాలను బాగుచేసే మరిన్ని అంశాలపై పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటామని మోడీ చెప్పారు.
ఇది మోడీ పీఎంఓగా ఉండకూడదు..
అంతకుముందు ప్రధాని మోడీ ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరుకొని తన బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం అంటే మోడీ ఒక్కరే కాదని, ఎంతోమంది ఆలోచనల సమాహారమన్నారు. పదేళ్ల క్రితం పీఎంఓ అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదన్నారు. ‘‘పీఎంఓ ఒక అధికార కేంద్రంలా ఉండాలన్నది నా విధానం కాదు. నేను అధికారం కోసం జన్మించలేదు. 2014కు ముందున్న భిన్నమైన పరిస్థితులను మార్చే దిశగా నిర్ణయాలు తీసుకున్నాం. పీఎంఓ ఎప్పుడూ ప్రజల కోసం పని చేయాలి. అది మోడీ పీఎంఓగా ఉండకూడదు’’ అని ప్రధానమంత్రి చెప్పారు.
గతం కంటే ఇప్పుడు ఎక్కువ పనిచేయాలి..
‘‘మనందరి లక్ష్యం.. దేశమే ప్రథమం, మనందరి మోటివేషన్.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించుకోవడం. 2047 కోసం నిర్విరామంగా పని చేస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చాను. నా బృందం నుంచి నాకు అలాంటి అంచనాలే ఉన్నాయి. మనం సమయం చూసుకొని, కాలానికి కట్టుబడి పనిచేసే వ్యక్తులం కాదు. మన ఆలోచనలకు పరిమితి లేదు. ఇలాంటి పరిమితులు లేకుండా పని చేసేవారే నా జట్టు సభ్యులు. వారినే ఈ దేశం విశ్వసిస్తుంది’’ అని మోడీ తెలిపారు. ‘‘గత పది సంవత్సరాల్లో నేను ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచించడం. నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇకపై చేయడం నా బాధ్యత అని అనుకుంటున్నాను. జీవితంలో మనం నేరవేర్చుకోవాలనుకున్న కోరిక స్థిరంగా ఉన్నప్పుడు.. కాలక్రమంలో దానికి స్థిరత్వం వస్తుంది. అప్పుడు దానిని నెరవేర్చుకునే క్రమంలో అది ఒక తీర్మానంగా మారుతుంది. ఆ తీర్మానానికి కఠోర శ్రమ కలిస్తే.. విజయంగా మారుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘ప్రతిఒక్కరూ నా ఎనర్జీకి కారణమేంటని అడుగుతుంటారు. ప్రతి వ్యక్తి తన లోపలి విద్యార్థిని సజీవంగా ఉంచితే.. ఎప్పటికీ శక్తిహీనుడు కాడు’’ అంటూ తనలోని ఉత్సాహానికి గల కారణాన్ని మోడీ వివరించారు.