Electric Roads: ఈవీలకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ రోడ్లు వచ్చేస్తోన్నాయ్!
సాధారణంగా మనకు మట్టి రోడ్లు, కంకర రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్లు రోడ్ల గురించి తెలుసు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా మనకు మట్టి రోడ్లు, కంకర రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్లు రోడ్ల గురించి తెలుసు. నిత్యం చూస్తుంటాం, ప్రయాణిస్తుంటాం. కానీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ రోడ్డు (Electric roads) రాబోతున్నాయి. మీరు విన్నది నిజమేనండి. భవిష్యత్తు రవాణా వ్యవస్థలో ఈ విప్లవాత్మకమైన మార్పులకు స్వీడన్ (Sweden) దేశం శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల్ని (Electric vehicles) నడుపుతూ ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ రోడ్లను నిర్మించనుంది.
రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. EVలు పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే చాలా తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిలో దాదాపు ఎలాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేయని మోటారు ఉంటుంది. దీంతో కాలుష్యం సమస్య ఉండదు. ఈ కారణంగానే ప్రపంచంలోని చాలా దేశాలు ఈవీలకే మొగ్గుచూపుతున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కొనసాగనుంది. అయితే, EVలకు ఉన్న అది పెద్ద సమస్య ఛార్జింగ్ చేయటం. ఈ నేపథ్యంలోనే స్వీడన్ ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత విద్యుదీకరించబడిన రహదారిని నిర్మిస్తోంది. ఇది ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేస్తుంది. దీంతో ఛార్జింగ్ కోసం పదే పదే ఆగాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ రహదారిని 2025 నాటికి నిర్మించాలని భావిస్తున్నారు.
స్వీడన్ 2045 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ రోడ్లకు ముందడుగు వేసింది. ఇక వీటి నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగానే కండక్టీవ్ రెయిల్స్, ఇండక్టీవ్ కాయిల్స్‌తో 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తోంది. ఈ రహదారిలో రోడ్డు ఉపరితలంపై విద్యుత్ కండక్టర్లు ఉంటాయి. ఇవి వాహక పికప్ ద్వారా కనెక్ట్ అవుతాయి. ఈ పద్ధతిలో వాహనం ప్రయాణించేటప్పుడు విద్యుత్తుని తీసుకుని ఛార్జింగ్ జరుగుతుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ రోడ్డు విజయవంతమైతే.. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనదారులకు పండుగే. అలాగే, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఖర్చుల నుంచి కూడా బిగ్ రిలీఫ్ దక్కుతోంది.