నిధుల కొరతతో.. విమాన సర్వీసులు ఆపేసిన 'గో ఫస్ట్' ఎయిర్ లైన్స్

తీవ్ర నిధుల కొరత కారణంగా వాడియా గ్రూప్ యాజమాన్యంలోని "గో ఫస్ట్" ఎయిర్ లైన్స్ మే 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2023-05-02 12:42 GMT

ముంబై: తీవ్ర నిధుల కొరత కారణంగా వాడియా గ్రూప్ యాజమాన్యంలోని "గో ఫస్ట్" ఎయిర్ లైన్స్ మే 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన ఏరో స్పేస్ సేవల కంపెనీ ప్రాట్ & విట్నీ సకాలంలో విమాన ఇంజన్‌లను సరఫరా చేయకపోవడంతో తమ విమానాల్లో సగానికిపైగా (దాదాపు 28) నడపలేని పరిస్థితి వచ్చిందని వెల్లడించింది. ఈ కారణం వల్లే తమ సంస్థకు తీవ్ర నిధుల కొరత ఎదురైందని గో ఫస్ట్ ఎయిర్‌లైన్ చీఫ్ కౌశిక్ ఖోనా మంగళవారం వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీ ఎల్టీ) ఎదుట స్వచ్చంద దివాలా పరిష్కార ప్రక్రియల కోసం దరఖాస్తును గో ఫస్ట్ దాఖలు చేసిందని తెలిపారు. కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికే ఇది చేయవలసి వచ్చిందన్నారు. తమ దరఖాస్తును ఎన్సీ ఎల్టీ అంగీకరించిన తర్వాత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ఈ పరిణామాల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి వివరణాత్మక నివేదికను కూడా సమర్పించనుంది. కాగా, గో ఫస్ట్‌లో 5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.

Tags:    

Similar News