ఆయుధాలు అప్పగించండి లేదంటే.. తీవ్ర పరిణామాలు

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న మిలిటెంట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Update: 2023-06-01 14:03 GMT

న్యూఢిల్లీ: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న మిలిటెంట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. మిలిటెంట్లు అందరూ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మణిపూర్‌ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన అనంతరం గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిగల విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించారు. ఈ హింసకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రతినిధులతోనూ అనేక విడతల్లో చర్చలు జరిపానని వెల్లడించారు. అధికారులు, రాజకీయ పార్టీలు, కుకీ, మెయిటీ తెగల ప్రతినిధులతోనూ చర్చించానని తెలిపారు.

మణిపూర్ గవర్నర్ మార్గదర్శకత్వంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు వివిధ సంస్థలు పని చేస్తున్నాయని, సీఆర్‌పీఎఫ్ రిటైర్డ్ డీజీ కుల్‌దీప్ సింగ్ ఈ సంస్థలను సమన్వయపరుస్తారని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని మణిపూర్ ప్రజలకు అమిత్ షా హామీ ఇచ్చారు.

భవిష్యత్తులో ఇటువంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసాకాండలో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

ఆయుధాలను కలిగి ఉన్న వారి కోసం కూంబింగ్ ఆపరేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఎవరి వద్దనైనా అక్రమ ఆయుధాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో త్రిపుర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్‌ సింగ్‌ను మణిపుర్ డీజీపీగా కేంద్రం నియమించింది.

Tags:    

Similar News