Bangladesh: మరోసారి నిరసనలు.. సుప్రీంకోర్టు ముట్టడి

బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు చెలరేగాయి. అక్కడ హింస చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారు.

Update: 2024-08-10 08:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు చెలరేగాయి. అక్కడ హింస చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారు. ఇప్పుడు విద్యార్థులు సుప్రీంకోర్టుని లక్ష్యంగా చేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జిలు రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సీజేఐ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుని చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు ప్రాంగణం నుండి పారిపోయి ఉండవచ్చని స్థానిక మీడియా తెలిపింది. కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో, నిరసనలు చెలరేగాయి. ఉద్రిక్తత నెలకొనడంతో షెడ్యూల్ చేసిన ఫుల్ కోర్టు సమావేశాన్ని అకస్మాత్తుగా రద్దు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుని ముట్టడించారు. అయితే, ఈ నిరసనల మధ్య పదవికి రాజీనామా చేస్తా అని సీజేఐ జస్టిస్ ఒబైదుల్ హసన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి

ప్రభుత్వ నియామక నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థులు తిరుగుబాటు చేయడంలో బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం, 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. అయినప్పటికీ, కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఎన్నికలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

టీ20 మహిళల వరల్డ్ కప్ ఎలా?

బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో టీ20 మహిళల వరల్డ్ కప్ నిర్వహణపై బంగ్లా క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరో రెండు నెలల్లో పొట్టి క్రికెట్ కప్ జరగనుంది. అయితే, ప్లేయర్ల భద్రతలపై క్రికెట్ బోర్డు నానా తంటాలు పడుతోంది. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. భద్రతకు సంబంధించి హామీ ఇవ్వాలని ఆర్మీ చీఫ్ ని బీసీబీ కోరింది. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Similar News