'ఉచితాలపై మీ వైఖరేంటి?'.. కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికలు సమీపించిన వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత హామీలతో ప్రజలను ప్రలోభ పెడుతున్నాయంటూ భట్టులాల్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

Update: 2023-10-06 13:41 GMT

న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపించిన వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత హామీలతో ప్రజలను ప్రలోభ పెడుతున్నాయంటూ భట్టులాల్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్ర సర్కారు, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కూడా నోటీసులను జారీ చేసింది.

ఈ పిటిషన్ పై స్పందించిన సీజేఐ చంద్రచూడ్.. ‘‘ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను అడ్డుకోవడం సాధ్యం కాదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రజలు పన్ను కట్టడం ద్వారా ఖజానాలోకి చేరే డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయంటూ పిటిషనర్ భట్టులాల్ జైన్ పేర్కొన్నారు. ప్రజాశ్రేయస్సు పేరుతో ఉచితాల రూపంలో ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేయకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇది ఎన్నికలకు ముందు డబ్బు పంచడం కన్నా నీచమైన నేరమని ధర్మాసనం ఎదుట పిటిషనర్ భట్టులాల్ జైన్ తరఫు న్యాయవాది వాదన వినిపించారు.


Similar News