ఫాక్స్‌కాన్ చెన్నై ప్లాంటులో వివాహిత మహిళలకు నో జాబ్

కంపెనీ నిబద్ధతకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వివాదాంశం అయింది.

Update: 2024-06-26 17:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ వివాదంలో చిక్కుకుంది. ఫాక్స్‌కాన్ ప్లాంటులో వివాహిత మహిళలను ఉద్యోగంలోకి తీసుకునేందుకు నిరాకరించిన వ్యవహారం తాజాగా బయటపడింది. ఇటీవల వివాహిత మహిళల దరఖాస్తులను కంపెనీ తిరస్కరించిందని, ఇప్పటికె చెన్నైలోని ప్లాంటులో వివాహిత మహిళలను పర్మినెంట్ ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. వివక్ష లేని రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పిన కంపెనీ నిబద్ధతకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వివాదాంశం అయింది. ఇటీవల ఇద్దరు మహిళలు చెన్నైలోని ఫాక్స్‌కాన్ ఐఫోన్ ఫ్యాక్టరీలో వివక్షకు గురైనట్టు చెప్పారు. గతేడాది వాట్సాప్ గ్రూప్ ద్వారా ఉద్యోగాల ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్లామని, కానీ అక్కడి సెక్యూరిటీ పెళ్లైన మహిళలు వెళ్లిపోవాలని సూచించినట్టు వారు వెల్లడించారు. ఈ విషయాన్ని ఫాక్స్‌కాన్ ఇండియా మాజీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సైతం ధృవీకరించారు. అయితే, ఈ వ్యవహారంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరినట్టు బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదికను అందించాలని ప్రాంతీయ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ఆదేశించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Similar News