జూన్‌లో భారత ఈక్విటీలోకి రూ. 26 వేల కోట్ల ఎఫ్‌పీఐలు

ఇటీవల ఎన్నికలు పూర్తయిన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Update: 2024-06-29 08:34 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఎన్నికలు పూర్తయిన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నికలకు ముందు అమ్మకాలకు దిగిన వారు, ఫలితాల అనంతరం తమ ధోరణిని మార్చుకున్నారు. దీంతో జూన్ నెలలో ఈక్విటీ మార్కెట్లో రూ. 26,565 కోట్ల కొనుగోళ్లు జరిపారు. ఇది 2024లో రెండవ అత్యధిక కొనుగోళ్ల పరంపరగా నిలిచింది. ఇదే ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.35,098 కోట్ల ఇన్‌ఫ్లోలు వచ్చాయి. జూన్‌కు ముందు, విదేశీ పెట్టుబడిదారులు మే నెలలో రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,671 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, జనవరిలో రూ. 25,744 కోట్లతో అమ్మకాలు జరిపారు. ఫిబ్రవరిలో మాత్రం రూ.1,539 కోట్ల స్వల్ప ఇన్‌ఫ్లోలు వచ్చాయి.

2023 తరువాత భారతీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బలమైన పెట్టుబడులకు దిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా JP మోర్గాన్ గ్లోబల్ బాండ్ సూచికలలో, భారత ప్రభుత్వ బాండ్‌లను చేర్చడం వలన దేశీయంగా కూడా పెట్టుబడులు భారీగా పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, అమెరికా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీంతో విదేశీ కొనుగోలుదారులకు భారత మార్కెట్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది. జూన్ నెలకు ముందు గత రెండు నెలల్లో అమ్మకాలకు దిగిన వారు ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దేశీయ, విదేశీ కొనుగోలు దారులతో మార్కెట్‌లు పుంజుకుంటున్నాయి.

Similar News