SBI తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు సెట్టి.. సిఫార్స్ చేసిన FSIB

దేశీయ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఛైర్మన్‌గా దాని మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన చల్లా శ్రీనివాసులు సెట్టి పేరును కేంద్ర పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) సిఫార్సు చేసింది.

Update: 2024-06-29 12:09 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఛైర్మన్‌గా దాని మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన చల్లా శ్రీనివాసులు సెట్టి పేరును కేంద్ర పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) సిఫార్సు చేసింది. ప్రస్తుత ఛైర్మన్ దినేష్ ఖరా ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. ఎస్‌‌బీఐ ఛైర్మన్ పదవికి గరిష్ట వయో పరిమితి అయిన 63 ఏళ్లు పూర్తి కావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఛైర్మన్‌గా శ్రీనివాసులును ఎఫ్‌ఎస్‌ఐబీ సూచించింది.

ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం ప్రతిభా వంతులను ఎంపిక చేస్తుంది. పనితీరు, అనుభవం ఆధారంగా సరైన వ్యక్తులను సిఫార్సు చేస్తుంది. ఎస్‌‌బీఐ ఛైర్మన్ పదవికి జూన్ 29న ఎఫ్‌ఎస్‌ఐబీ ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో పాల్గొన్న వారిలో శ్రీనివాసులు సెట్టి అత్యంత సీనియర్ అయినందును ఆయనను ఈ పదవికి అర్హులుగా ప్రకటించారు.

ఆయనతో పాటు మరో ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్లు అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం టోన్సేలను కూడా ఇంటర్వ్యూ చేశారు. నిబంధనల ప్రకారం, ఎస్‌‌బీఐకి పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ల నుండి ఛైర్మన్‌ను నియమిస్తారు. దానిలో భాగంగానే ఈ ముగ్గురి నుంచి ఒకరిని ఎంపిక చేశారు.

ఎఫ్‌ఎస్‌ఐబీకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మాజీ సెక్రటరీ భాను ప్రతాప్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ఈ ప్యానెల్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెక్రటరీ, ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ సభ్యులుగా ఉంటారు. ఇది సిఫార్స్ చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

Similar News