దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు అరెస్ట్
సరైన పత్రాలు లేకుండా భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు రోహింగ్యాలు, ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని త్రిపురలోని అగర్తల రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: సరైన పత్రాలు లేకుండా భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు రోహింగ్యాలు, ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని త్రిపురలోని అగర్తల రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో నలుగురు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని రోహింగ్యా క్యాంపులకు చెందిన అమిత్ హకీమ్, యాస్మిన్ అఖ్తర్, ఎండీ తారెక్, ముహమ్మదుల్లాగా గుర్తించారు, మరో బంగ్లాదేశ్ జాతీయుడు ఆ దేశంలోని కొమిల్లా జిల్లాకు చెందిన సుక్కుర్ అలీగా గుర్తించారు.
శనివారం అగర్తల రైల్వే స్టేషన్‌లో ఉన్న వీరిని అనుమానంతో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), రైల్వే పోలీసు ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సంయుక్త బృందం అరెస్టు చేసింది. వారి వద్ద ఎలాంటి సరైన పత్రాలు లభించకపోవడంతో అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. అధికారులు తెలిపిన దాని ప్రకారం, వారు రైలులో చెన్నై, గుజరాత్, హైదరాబాద్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. త్రిపుర బంగ్లాదేశ్‌తో 856 కి.మీ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా భారత్‌కు రావాలని ప్రయత్నిస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు.