సూపర్ రిచ్ హిందూజా కుటుంబంలో నలుగురికి జైలుశిక్ష

దిశ, నేషనల్ బ్యూరో : భారత సంతతికి చెందిన హిందూజా కుటుంబ సభ్యులు బ్రిటన్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఉంటారు.

Update: 2024-06-21 18:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత సంతతికి చెందిన హిందూజా కుటుంబ సభ్యులు బ్రిటన్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఉంటారు. అటువంటి విఖ్యాత కుటుంబానికి చెందిన నలుగురికి స్విట్జర్లాండ్‌లోని ఓ కోర్టు జైలుశిక్ష విధించింది. స్విట్జర్లాండ్‌ దేశంలోని జెనీవా నగరంలో ప్రకాశ్‌ హిందూజా కుటుంబానికి ఒక విల్లా ఉంది. ఆ విల్లాలో పనిచేసే సిబ్బంది కంటే పెంపుడు కుక్కలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే అభియోగాలు నిరూపితం కావడంతో హిందూజా కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది.

ప్రకాశ్‌ హిందూజా, ఆయన సతీమణి కమల్‌కు చెరో నాలుగున్నరేళ్ల జైలుశిక్ష పడింది. ప్రకాశ్‌ హిందూజా కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు చెరో నాలుగేళ్ల శిక్ష పడింది. కోర్టు ఈ తీర్పును వెలువరించే టైంలో వారెవరూ అక్కడ లేరు. ప్రకాశ్‌ హిందూజా కుటుంబ వ్యాపార వ్యవహారాలు చూసుకునే నజీబ్‌ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెండెడ్‌ శిక్ష విధించింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పుపై ఎగువ న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని ప్రకాశ్‌ హిందూజా తరఫు న్యాయవాది వెల్లడించారు.


Similar News