రోడ్డెక్కిన జమ్మూ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు.. ఉగ్రమూకలను అరెస్ట్ చేయాలని డిమాండ్

న్యాయం చేయాలంటూ జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా డాంగ్రీ గ్రామస్తులు రోడ్డెక్కారు.

Update: 2023-06-12 11:03 GMT

రాజౌరి (జమ్మూ) : న్యాయం చేయాలంటూ జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా డాంగ్రీ గ్రామస్తులు రోడ్డెక్కారు. ఈ ఏడాది జనవరి 1న డాంగ్రీ గ్రామంపై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఏడుగురు పౌరుల కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం జమ్మూ-పూంచ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆరోజు ఊరిపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన వారి ఫోటోలను చూపిస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

హైవేపై బైఠాయించి.. టైర్లను కాల్చారు. దీంతో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. మే 6న రాజౌరిలోని అటవీ ప్రాంతంలో ఉన్న కంది ప్రాంతంలో ఆర్మీ స్పెషల్ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కొంతమంది స్థానికులు ఆ డెడ్ బాడీని చూసి.. అతడు డాంగ్రీ గ్రామంపై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడని గుర్తించారు.


Similar News