'తప్పుడు కేసులు బనాయిస్తున్నారు'.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

Update: 2023-10-06 15:14 GMT

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలను లొంగదీసుకునేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు. కేంద్ర ఏజెన్సీల దాడులపై శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్షాలను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నంలో ఎన్ని తప్పుడు కేసులు బనాయిస్తున్నారో చూస్తున్నామని చెప్పారు. బీజేపీలోకి నేతలను చేర్చుకోవడానికి ప్రజలను విభజిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలనే కాకుండా, చాలా మంది వ్యాపారవేత్తలనూ టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లోనే కాక వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లోనూ భయానక వాతావరణం నెలకొనడం దేశానికి మంచిది కాదన్నారు. ఈ ఏజెన్సీ గేమ్ ఆడటం వల్ల దేశం పురోగమించదని అన్నారు.


Similar News