పరోక్షంగా రెజ్లర్లను ఉద్దేశించి హిందీ పద్యం.. కవిగా మారిపోయిన బ్రిజ్ భూషణ్

మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొన్ని నిమిషాల పాటు కవిగా మారిపోయారు.

Update: 2023-06-11 13:00 GMT

న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొన్ని నిమిషాల పాటు కవిగా మారిపోయారు. "కభీ అష్క్.. కభీ ఘమ్.. తో కభీ జెహెర్ పియా జాతా హై.. తబ్ జాకర్ జమానే మే జియా జాతా హై" అనే సెంటిమెంటల్ పద్యంతో ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన బీజేపీ 'మహాసంపర్క్ అభియాన్' సభలో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. "కొన్నిసార్లు కన్నీళ్లు.. కొన్నిసార్లు విచారం.. కొన్నిసార్లు విషం తాగాల్సి వస్తుంది.. అప్పుడే ఈ సమాజంలో జీవించగలుగుతాం.. ఇది నా ప్రేమకు నేను పొందిన ప్రతిఫలం, వారు నన్ను నమ్మకద్రోహి అంటారు. దానిని అపఖ్యాతి లేదా కీర్తి అని పిలుస్తారు.. వాళ్ళు పెదవులు బిగించి నా పేరును పలుకుతారు" అనేది ఆ హిందీ పద్యం సారాంశం.

రెజ్లర్ల గురించి ప్రసంగంలో నేరుగా ప్రస్తావించకుండా.. వారిని ఉద్దేశించి పరోక్షంగా ఈ పద్యాన్ని చదివి ఉండొచ్చని భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్ళీ కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బ్రిజ్ భూషణ్ ప్రకటించారు. "కాంగ్రెస్ హయాంలో భారతదేశపు 78,000 చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్ ఆక్రమించింది. 1972లో 92,000 పాకిస్తాన్ యుద్ధ ఖైదీలు మన దేశం అదుపులోకి వచ్చారు. పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి పొందేందుకు అది మంచి అవకాశం. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఒకవేళ ఆనాడు మోడీ ప్రధానిగా ఉండి ఉంటే ఖచ్చితంగా దాన్ని తిరిగి పొందగలిగేవారు” అని ఆయన అన్నారు.


Similar News