Manish Sisodia: ఇంతకాలం జైల్లో ఉంటానని అనుకోలేదు

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఇంతకాలం జైలులో ఉంటానని అనుకోలేదని ఆప్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.

Update: 2024-08-14 10:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఇంతకాలం జైలులో ఉంటానని అనుకోలేదని ఆప్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్‌ అయిన సిసోడియా.. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో దాదాపు 17 నెలల తర్వాత ఆగస్టు 9న జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. విచారణను పొడిగించాలనే లక్ష్యంతో తనపై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. కొన్ని నెలల ముందు కూడా తాను జైలుకు వెళ్తానని ఊహించలేదని తెలిపారు. తనను జైల్లో ఉంచేందుకు మద్యం పాలసీ కేసు రూపంలో బీజేపీ కల్పిత కుంభకోణం చేసిందని అన్నారు.

అరెస్టు వెనుక ఏదో కారణం ఉంటుంది

సిసోడియా మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. కాబట్టి నాకు లోపల నుంచి నమ్మకం ఉండేది. ఒక వ్యక్తిని జైలుకు పంపడం లేదా అరెస్టు చేయడం వెనుక ఏదో కారణం ఉంటుందని అనుకుంటున్నా. సంస్కరణలు తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలని క్రియాశీల రాజకీయాల్లోకి ఎవరైనా రావాలనుకుంటే.. వారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తారని ఆశించవద్దన్నరు. దానికి తగ్గినట్లే నేను మానసికంగా సిద్ధమయ్యా. కానీ, 17 నెలలపాటు ఎక్సైజ్ పాలసీ కేసులో జైళ్లో ఉంటానని ఊహించలేదు.’ అని అన్నారు.

ఆరోపణలన్నీ కల్పితమే

ఎక్సైజ్ పాలసీ కేసులో వస్తున్న ఆరోపణలన్నీ కల్పితమే అని సిసోడియా అన్నారు. ‘పీఎంఎల్ చట్టం కింద ఈడీ, సీబీఐ నామీద కేసులు పెట్టింది. ఈ చట్టం ప్రధానంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాలకు నిధులు సమకూర్చకుండా ఆపేందుకు ఉద్దేశించింది. ఈ కేసులో బెయిల్ సాధించడం కష్టం. అందుకే నన్ను చాలా కాలం జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం.’ అని అన్నారు. ముఖ్యంగా తన భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు జైలులో ఉండటంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఆసమయంతో తాను కృంగిపోకూడదని బలంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జైలులో ఉన్నప్పుడు, దాదాపు 15 నుంచి 16 గంటలు ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడే అవకాశం ఉండదన్నారు. అందుకే తనతో తానే స్నేహం చేయడం అలవాటు చేసుకున్నానని తెలిపారు.

పార్టీ కోసం పనిచేసేందుకు గర్వంగా ఉంది

మళ్లీ డిప్యూటీ సీఎంగా..కాగా ఢిల్లీ ప్రభుత్వంలో తిరిగి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఉందా అనే ప్రశ్నకు సిసోడియా జవాబిచ్చారు. ప్రస్తుతానికి, పార్టీ కోసం పని చేయడం గర్వంగా ఉందని, పరిపాలనలో భాగం కావడానికి తొందరపడటం లేదని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చి కేవలం నాలుగు రోజులే అయ్యిందని పేర్కొన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే జైలు నుంచి బయటకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వచ్చాక తాను పార్టీ ప్రచారంలోఉండాలా లేదా ప్రభుత్వంలో ఉండాలా అని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.

బీజేపీ అన్నింట్లో మోసాన్నే చూస్తుంది

అయితే, పార్టీలో లేదా ఢిల్లీ ప్రభుత్వంలో తన పాత్ర విషయానికి వస్తే తనకు వ్యక్తిగత ఎంపిక లేదని సిసోడియా పేర్కొన్నారు. తన ప్రభుత్వాన్ని దెబ్బతీసేలా అరెస్టులు చేసినప్పటికీ ఢిల్లీ ప్రజలు తమన మరింతగా గౌరవిస్తున్నారని అన్నారు. కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తాము ఎలా పనిచేస్తున్నామో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సక్రమంగా పనిచేయకపోవడం వల్లే ఢిల్లీ అస్తవ్యస్తంగా మారిందన్న బీజేపీ ఆరోపణలను ఆయన ఖండించారు. కాషాయపార్టీ ప్రతిదాంట్లో మోసాన్నే చూస్తుందని మండిపడ్డారు. ఇండియా కూటమి గురించి సిసోడియా స్పందించారు. నిరంకుశ రాజకీయాలపై పోరాడేందుకు ప్రతిపఘక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.


Similar News