Engineer Rashid: ప్రభావం చూపని ఇంజనీర్ రషీద్.. ఒక సీటుకే పరిమితమైన ఏఐపీ

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్, ఎన్సీ కూటమి విజయం సాధించింది.

Update: 2024-10-08 12:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి విజయం సాధించింది. అయితే లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అనుకున్నంతగా ఆ పార్టీ తన మార్క్ కనబర్చలేకపోయింది. ఏఐపీ పార్టీ జమాతే ఇస్లామీ (జేఈఐ)తో కలిసి ఎన్నికల బరిలో దిగింది. ఏఐపీ మద్దతిచ్చిన 35 స్థానాలకు గాను ఒకే అభ్యర్థి గెలుపొందారు. లంగేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కుర్షీద్ అహ్మద్ షేక్ విజయం సాధించారు. ఇక, జేఈఐ మద్దతిచ్చిన 10 మంది అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

కాగా, టెర్రర్ ఫండింగ్ కేసులో 2019లో అరెస్టైన ఇంజనీర్ రషీద్ జైలులో ఉండగానే లోక్ సభ ఎన్నికల్లో బారాముల్లా సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఏకంగా నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లాపైనే విజయం సాధించారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గాను బెయిల్ పై బయటకు వచ్చిన రషీద్ అనేక ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. దీంతో ఆయన ఎన్నికల్లో ప్రభావం చూపుతారని అంతా భావించారు. కానీ కేవలం ఒక సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ఓట్లను చీల్చేందుకే బీజేపీ ఈ పార్టీలను తెరపైకి తెచ్చిందని, అందుకే ప్రజల మద్దతు పొందలేక పోయాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Similar News