J&K: జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్‌

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత భద్రత బలగాలు జమ్మూకశ్మీర్‌లో సెర్చింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

Update: 2024-09-13 15:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత భద్రత బలగాలు జమ్మూకశ్మీర్‌లో సెర్చింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కిష్త్వార్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఛత్రూలోని నైద్‌ఘం గ్రామం ఎగువ ప్రాంతంలోని పింగ్నాల్ దుగడ్డ అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో పోలీసులతో కలిసి సంయుక్తంగా భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈ ప్రాంతం అడవిలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందిందని, కాల్పులు నేపథ్యంలో మద్దతుగా మరిన్ని బలగాలను ఘటనాస్థలికి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 18న జమ్మూకశ్మీర్‌లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి దాడులు పొంచి ఉన్న కారణంగా అన్ని ప్రాంతాలను కూడా భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఎన్నికల దృష్ట్యా, కిష్త్వార్‌తో పాటు దాని పక్కనే ఉన్న దోడా, రాంబన్ జిల్లాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. జనావాస ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల భద్రతకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు.


Similar News