బీజేపీకి ‘మేఘా’ 584 కోట్లు.. వైసీపీకి ‘లాటరీ కింగ్’ 154 కోట్లు
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్లతో ముడిపడిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్లతో ముడిపడిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన ఆల్ఫా న్యూమరిక్ నంబర్ల వివరాలతో కూడిన విరాళాల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గురువారం ఉదయం అందించింది. దీంతో ఆ సమాచారాన్ని ఈసీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం సాయంత్రం పబ్లిష్ చేసింది. 2018 సంవత్సరం నుంచి 2024 ఫిబ్రవరి వరకు దేశంలోని ఏయే కంపెనీలు.. ఏయే రాజకీయ పార్టీలకు ఎంతమేర విరాళాలను అందించాయనే విషయం ఆ జాబితాల్లో బహిర్గతమైంది.
లాటరీ కింగ్ మార్టిన్ నుంచి ఏ పార్టీకి ఎంత ?
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విరాళాలను అందించింది. ఈ కంపెనీ విరాళాల్లో అత్యధికంగా రూ.542 కోట్లు మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకి వెళ్లాయి. శాంటియాగో మార్టిన్ నుంచి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి రూ.503 కోట్ల విరాళం అందింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా శాంటియాగో మార్టిన్ నుంచి రూ.154 కోట్ల విరాళం వచ్చింది. బీజేపీకి కేవలం రూ.100 కోట్లే ఈ సంస్థ నుంచి వచ్చాయి.
మేఘా నుంచి ఏ పార్టీకి ఎంత ?
మన హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ, దాని అనుబంధ సంస్థ వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ కలిసి రూ.1,186 కోట్ల విరాళాలను దేశంలోని రాజకీయ పార్టీలకు అందించాయి. ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా విరాళాలను ఇవ్వడంలో నంబర్ 2 ప్లేస్‌లో మేఘా నిలిచింది. ఈ కంపెనీ ఇచ్చిన విరాళాల్లో 60 శాతం బీజేపీ అకౌంట్లోకే వెళ్లాయి. గత ఆరేళ్లలో కమలదళానికి మేఘా కంపెనీ రూ.584 కోట్ల విరాళం ఇచ్చింది.కేసీఆర్‌కు చెందిన భారత రాష్ట్ర సమితికి రూ.195 కోట్లు, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు రూ.85 కోట్లను మేఘా అందించింది.మేఘా అనుబంధ సంస్థ వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి రూ.110 కోట్లు విరాళంగా ఇవ్వడం గమనార్హం. ఇక ఈ కంపెనీ బీజేపీకి రూ.80 కోట్ల డొనేషన్ ఇచ్చింది.
ఇతర ప్రముఖ కంపెనీల నుంచి..
రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సంబంధం కలిగిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బీజేపీకి రూ.385 కోట్లు, రూ.25 కోట్లు శివసేనకు విరాళంగా అందాయి. హల్దియా ఎనర్జీ కంపెనీ మమతా బెనర్జీ పార్టీకి రూ.281 కోట్లు, బీజేపీకి రూ.81 కోట్లను అందించింది. వేదాంత కంపెనీ బీజేపీకి రూ.226 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.104 కోట్లు ఇచ్చింది. కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ ఫ్రా, ఎంకేజే ఎంటర్ ప్రైజెస్, మదన్ లాల్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు కోల్‌కతాలోని ఒకే అడ్రస్‌తో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు కలిసి రాజకీయ పార్టీలకు మొత్తం రూ.573 కోట్ల విరాళం ఇచ్చాయి. ఇందులో రూ.346 కోట్లు బీజేపీకి, రూ.121 కోట్లు కాంగ్రెస్‌కు వచ్చింది.