దూకుడు పెంచిన ఈడీ.. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో కీలక మలుపు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఊహించని పరిణామం చోటుచేసుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఊహించని పరిణామం చోటుచేసుకున్నది. ఇప్పటికే అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న విజయ్ నాయర్, అమిత్ అరోరాలను ప్రశ్నించాల్సి ఉన్నదని కోర్టుకు ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చింది. జైల్లోనే వారిద్దరినీ ఎంక్వయిరీ చేసుకోడానికి అనుమతి మంజూరైంది. ఈ వారంలోనే రెండు రోజుల పాటు వారిని ఎంక్వయిరీ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ విభాగానికి విజయ్ నాయర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా బడ్డీ రిటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మద్యం కంపెనీకి అమిత్ అరోరా డైరెక్టర్‌గా ఉన్నారు.
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, సౌత్ గ్రూపునకు కీలక మధ్యవర్తిగా విజయ్ నాయర్ వ్యవహరించారన్నది అటు సీబీఐ, ఇటు ఈడీ అధికారుల బలమైన అనుమానం. అవి దాఖలు చేసిన చార్జిషీట్లలో సైతం ఇదే అంశాన్ని నొక్కిచెప్పాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూపులోని ఎమ్మెల్సీ కవిత, ఆమె తరఫు ప్రతినిధి అరుణ్ రామచంద్ర పిళ్లయ్, ఆడిటర్ బుచ్చిబాబులతో విజయ్ నాయర్ పలుమార్లు సమావేశమయ్యారన్నది వాటి ఆరోపణ. ఇప్పటికీ వీరిద్దరిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ, ఈడీ అధికారులు వారి నుంచి స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేశారు. తాజాగా రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు ఈడీ సమర్పించి రెండు సప్లిమెంటరీ చార్జిషీట్లలోనూ వారిద్దరిపై అభియోగాలను నమోదు చేసింది.
ఇప్పుడు మరోసారి వారిని విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేయాలని ఈడీ భావించడం విశేషం. మరోవైరపు కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబుకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో బుధవారం హాజరయ్యారు. గతంలో విచారణ సందర్భంగా బుచ్చిబాబు వెలువరించిన అనేక కీలక అంశాలను ఈడీ తన తాజా చార్జిషీట్‌లో ప్రస్తావించింది. దర్యాప్తు ప్రక్రియ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో ఏక కాలంలో అటు విజయ్ నాయర్, అమిత్ అరోరాను తీహార్ జైల్లో ప్రశ్నించి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయనుండగా బుచ్చిబాబు నుంచి కూడా లేటెస్ట్ స్టేట్‌మెంట్ తీసుకోనున్నది.
ఇంకోవైపు సీబీఐ నమోదు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇంటెరిమ్ బెయిల్ కోరుతూ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనపై ఒక్క రోజు వ్యవధిలోనే స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు జస్టిస్ దినేష్ కుమార్ శర్మ.