ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో CM కేజ్రీవాల్ కింగ్‌పిన్: ED
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. సీనియర్ లాయర్ ఏఎం సింఘ్వీ కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించగా.. ఎస్వీ రాజు ఈడీ తరపున వాదనలు వినిపించారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై ఈడీ తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. ‘మద్యం పాలసీ అమలులో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
సౌత్ గ్రూపునకు అనుకూలంగా ఉన్నారు. సౌత్ గ్రూపు నుంచి కేజ్రీవాల్‌కు రూ.300 కోట్లు అందాయి. ఈ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టేపనిలో కేజ్రీవాల్ ఉన్నారు. అందులో రూ.45 కోట్లను ఇప్పటికే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. చెన్నై నుంచి ఢిల్లీ.. ఆ తర్వాత గోవాకు డబ్బును తరలించారు. ఓవరాల్‌ను మద్య పాలసీ అమలులో కేజ్రీవాల్ కింగ్‌పిన్’ అని ఈడీ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు.