మనీ లాండరింగ్ అభియోగాలతో ఈడీ కొరడా.. మాజీ ఎంపీ ఆస్తులు అటాచ్‌

Update: 2023-10-15 13:12 GMT

ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ ఎంపీ ఈశ్వర్‌లాల్‌ శంకర్‌లాల్‌ జైన్‌ లాల్వాని(77)కి చెందిన దాదాపు రూ.315 కోట్లు విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులలో పెద్దసంఖ్యలో బంగారం, వజ్ర, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈశ్వర్ లాల్‌కు చెందిన విండ్‌మిల్స్‌‌తో పాటు ముంబయి, జల్‌గావ్‌, థానే, కచ్‌, సిలోడ్‌ వంటి ప్రాంతాల్లోని స్థిరాస్తులనూ అధికారులు అటాచ్ చేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఉద్దేశపూర్వకంగా రూ.352.49 కోట్లు నష్టం వాటిల్లేలా చేసి, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగంతో గతంలో ఆయనపై సీబీఐ పలు కేసులు నమోదు చేసింది.

వీటి ఆధారంగా ఈడీ తాజా చర్యలకు ఉపక్రమించింది. మహారాష్ట్రలోని రాజ్‌మల్‌ లాల్‌చంద్‌ జ్యూవెల్లర్స్‌, ఆర్‌ఎల్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మన్‌రాజ్‌ జ్యూవెల్లర్స్‌ సంస్థలలో ప్రమోటర్‌గా ఈశ్వర్‌లాల్‌ శంకర్‌లాల్‌ ఉన్నారు. ఈ సంస్థలకు సంబంధించిన బంగారం, నగల వివరాలను, లావాదేవీల సమాచారాన్ని అకౌంట్ బుక్స్‌లో తప్పుగా నమోదు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. నకిలీ పత్రాలతో బ్యాంకు లోన్లు తీసుకొని లెక్కలను తారుమారు చేశారని అంటోంది.


Similar News