కేంద్రమంత్రి కరంద్లాజేపై తక్షణ చర్యలు.. ఈసీ ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ డీఎంకే చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ డీఎంకే చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వెంటనే శోభా కరంద్లాజేపై తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ అధికారిని బుధవారం ఆదేశించింది. తమ ఆదేశాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలుపుతూ 48 గంటల్లోగా నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఐఈడీ పేలుడుకు తమిళనాడుకు చెందిన వ్యక్తే కారణమని వ్యాఖ్యలు చేసినందుకు కరంద్లాజేపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే కోరింది. తమిళనాడు ప్రజలను ఉగ్రవాదులుగా అభివర్ణించడం దారుణమని తెలిపింది. ఈ వ్యవహారంలో తమిళనాడులోని మధురై పోలీసులు కరంద్లాజేపై కేసు నమోదు చేశారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ఆమె యత్నించారనే అభియోగాలను మోపారు. డీఎంకే ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ అధికారికి తాజా ఆదేశాలు జారీ చేసింది. గత మంగళవారం రోజు బెంగళూరులో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో కరంద్లాజే మాట్లాడుతూ.. ‘‘కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయి. తమిళనాడు నుంచి వచ్చిన వారు ఇక్కడ బాంబులు వేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. కేరళ నుంచి వచ్చిన వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు’’ అని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.