2024లో ప్రమాదకర గ్లేసియల్ లేక్స్‌‌ను గుర్తించే హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు!

Update: 2023-10-16 13:26 GMT

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది హిమాలయాల్లోని కొన్ని హై-రిస్క్ సరస్సుల వద్ద ముందస్తు హెచ్చరిక వ్యవస్థ మొదటి దశను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉన్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ నెలలో విధ్వంసక వరదల కారణంగా 60 మంది వరకు మరణించడంతో కేంద్రం ఈ విషయంపై దృష్టి సారించింది. దేశంలో 56 గ్లేసియల్ లేక్స్‌‌ ప్రమాదంలో ఉన్నాయి. రెండు వారాల క్రితం తూర్పు హిమాలయాల్లోని లొనాక్ సరస్సు కట్ట తెగిపోయి సిక్కిం భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ ఘటన తర్వాత అధిక ప్రమాదం కలిగిన సరస్సుల పర్యవేక్షణ ఆవశ్యకత పెరిగిందని సోమవారం ప్రకటనలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్‌డీఎంఏ) సభ్యుడు కృష్ణ ఎస్ వత్స వివరించారు. భారీ వర్షాలు, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం లాంటి కారణాలతో కొన్నిసార్లు హిమనీ నదాల నుంచి నీళ్లు చేరే సరస్సులు కట్టలు తెగి ఉప్పొంగుతాయి. వీటిని ముందుగానే గుర్తించగలిగితే సకాలంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలవుతుంది.

ఆనకట్టల గేట్లను కూడా పైకి ఎత్తడం ద్వారా ఘోరమైన ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించవచ్చు. దేశంలో మొదటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను లొనాక్ సరస్సు వద్ద, సమీపంలోని షాకో చొ సరస్సు వద్ద ఏర్పాటుపై స్విస్ నిపుణులతో భారత్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా వరదలు ఇళ్లు, నిర్మాణాలను ముంచెత్తడానికి కనీసం 90 నిమిషాల ముందు హెచ్చరికను వస్తుంది. ఈ వ్యవస్థ మొదటి దశలో సరస్సుల వద్ద వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించేందుకు వచ్చే ఏడాది నాటికి కొన్నిటిని ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో వాటి ఏర్పాటు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.


Similar News