మోడీ కన్యాకుమారి పర్యటన వేళ.. 33 ఏళ్ల క్రితం ఫొటో వైరల్

ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత గురువారం సాయంత్రం ప్రధాని మోడీ రెండు రోజుల ధ్యానం కోసం తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు.

Update: 2024-05-30 13:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత గురువారం సాయంత్రం ప్రధాని మోడీ రెండు రోజుల ధ్యానం కోసం తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద రెండు రోజుల పాటు సుదీర్ఘ ధ్యానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో 33 ఏళ్ల క్రితం మోడీ ఈ ప్రఖ్యాత స్థలం వద్ద పర్యటించిన ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. డిసెంబర్ 11, 1991న వివేకానంద రాక్ మెమోరియల్ నుండి బీజేపీ ఏక్తా యాత్ర ప్రారంభించిన సందర్భంగా తీసిన ఫొటో ఇది.

దీనిలో నరేంద్ర మోడీ, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషితో సహా ఇతరులు స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించినట్లుగా ఉంది. ఈ యాత్ర 1991లో కన్యాకుమారి నుండి ప్రారంభమై, జనవరి 26, 1992న శ్రీనగర్‌లో ముగిసింది. ఏక్తా యాత్రకు ప్రముఖ బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి నాయకత్వం వహించగా, అప్పుడు మోడీ కార్యకర్తగా మార్చ్‌ను నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు. 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ధ్యాన్ మండపం వద్ద మే 30-జూన్ 1 వరకు మోడీ ధ్యానం చేయనున్నారు. ఇంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల ముగింపు తర్వాత ప్రధాని మోడీ ఇదే విధమైన ఆధ్యాత్మిక యాత్రను చేపట్టారు. కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం సమీపంలోని గుహలో ధ్యానం చేశారు.


Similar News