Droupadi Murmu: మహిళల సాధికారతపైనే దేశబలం ఆధారపడి ఉంటుంది- రాష్ట్రపతి

మహిళల సాధికారతపైనే దేశబలం ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) అన్నారు.

Update: 2024-09-16 10:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహిళల సాధికారతపైనే దేశబలం ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) అన్నారు. సీఎన్‌ఎన్‌-న్యూస్‌18 షీశక్తి 2024 కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘మన దేశంలో మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పుడూ ధైర్యం, శక్తి ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఆడవారి భద్రతకు సంబంధించి కఠినచట్టాలున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు అభద్రతా భావం ఇంకా వెంటాడుతోంది. సంప్రదాయాలు, సామాజిక అసమానతలతో మహిళలు పోరాడుతునే ఉన్నారు. ఏళ్ల తరబడి నాటుకు పోయిన సామాజిక భావనలు మహిళా సమానతకు అడ్డంకిగా మారుతున్నాయి. మార్పులు జరిగినా ఆ అసమానతలు పోవట్లేదు. మనమంతా ఆత్మపరిశీలన చేసుకొని .. పరిస్థితి మెరుగుపడటానికి ఏంచేయాలని ప్రశ్నించుకోవాల్సిన అవసరముంది. దేశప్రగతికి కీలకమే మహిళా భద్రత, గౌరవం. మహిళల మర్యాదను కాపాడేందుకు, రక్షణ కల్పించేందుకు మనమందరం బలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

మహిళలను దేవతలుగా పూజిస్తాం

వందల ఏళ్ల క్రితమే భారతదేశానికి మాతృహోదా ఇచ్చామని రాష్ట్రపతి అన్నారు. దేశాన్ని తల్లిగా భావిస్తామని.. మహిళలకు గౌరవం ఇచ్చే సంప్రదాయం ఉందన్నారు. మహిళలను దేవతలుగా పూజిస్తామన్నారు. ఓవైపు దుష్ట సంహారం చేసే కాళీ, దుర్గగా.. మరోవైపు సకల ఐశ్వర్యాలిచ్చే, ఆశీర్వదించే లక్ష్మీ, సరస్వతిగా కొలుస్తామన్నారు. మహిళలు నిజమైన శక్తికి ప్రతిరూపాలు అని కొనియాడారు. ఇకపోతే, ఈ సారి షీశక్తి కార్యక్రమం ‘బ్రేకింగ్‌ బ్యారియర్స్‌’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. పలురంగాల్లో అద్భుత ప్రతిభ చూపించిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అనుభవాలను పంచుకోనున్నారు.

Tags:    

Similar News