Doda encounter: ఆర్మీ కెప్టెన్ వీరమరణం.. నలుగురు ఉగ్రవాదులు హతం..!

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందారు. 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కెప్టెన్ అమరుడైనట్లు అధికారులు ప్రకటించారు.

Update: 2024-08-14 08:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందారు. 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కెప్టెన్ అమరుడైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా.. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, దోడా జిల్లా అస్సార్‌లోని శివగఢ్ ధార్ దగ్గర ఉగ్రవాదులు నక్కిఉన్నారనే సమాచారంతో ఆర్మీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఎన్ కౌంటర్ ప్రారంభమైనట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. అస్సార్‌ సమీపంలోని నదీతీరంలో ముష్కరులు దాక్కున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పక్కనే ఉన్న ఉధంపూర్ జిల్లాలోని పట్నితోప్ సమీపంలోని అడవి నుంచి దోడాలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉధంపూర్ లో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఆతర్వాత కాల్పులు జరపకుండా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతాదళాలు రక్తంతో తడిసిన నాలుగు బ్యాగులు, M-4 కార్బైన్‌లను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.


Similar News