గిరిజనులకు డీఎన్ఏ టెస్ట్..రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ గిరిజనులకు డీఎన్ఏ టెస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ సమావేశంలో భాగంగా ప్రసంగిస్తూ..‘గిరిజనులు హిందువులా కాదా అనేది వారి పూర్వీకులను అడుగుతాం.

Update: 2024-06-23 13:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ గిరిజనులకు డీఎన్ఏ టెస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ సమావేశంలో భాగంగా ప్రసంగిస్తూ..‘గిరిజనులు హిందువులా కాదా అనేది వారి పూర్వీకులను అడుగుతాం. అనంతరం వారి వంశవృక్షాన్ని నమోదు చేస్తాం. వంశపారం పర్య నిపుణులతోనూ సంప్రదింపులు జరుపుతాం. వారు హిందువులు కాకపోతే, వారు వారి తండ్రుల పిల్లలా కాదా అని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష చేస్తాం’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయ. కాంగ్రెస్, భారతీయ ఆదివాసీ పార్టీ సహా, రాజస్థాన్‌లోని అనేక గిరిజన సంస్థలు దిలావర్ పై మండిపడ్డాయి.

దిలావర్ గిరిజన సమాజాన్ని అవమానించారని బన్స్వారా ఎంపీ రాజ్ కుమార్ రోట్ ఫైర్ అయ్యారు. దిలావర్ వెంటనే గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు తమ రక్త నమూనాలను డీఎన్ఏ పరీక్ష కోసం దిలావర్, సీఎం భజన్‌లాల్ శర్మకు పంపాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభిస్తానని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా గిరిజనులకు బీజేపీ నష్టం చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా మాట్లాడుతూ..దిలావర్‌ను మానసిక రోగిగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రతాప్‌గఢ్‌లో ఆదివాసీ యువమోర్చా దిలావర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. 


Similar News