'ఢిల్లీ ఆర్డినెన్స్‌పై చర్చించాలి'.. విపక్ష పార్టీ నేతలకు కేజ్రీవాల్ లేఖ

బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బీహార్ సీఎం, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ కృషి చేస్తున్నారు.

Update: 2023-06-21 12:47 GMT

న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బీహార్ సీఎం, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ కృషి చేస్తున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ‘ఉమ్మడి అభ్యర్థి’ని నిలబెట్టడంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ నెల 23వ తేదీన (శుక్రవారం) 20 విపక్ష పార్టీలతో పాట్నాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో తొలి అంశంగా ఢిల్లీ ఆర్డినెన్స్ పై చర్చించాలని కోరుతూ ఇందులో పాల్గొనే వివిధ పార్టీల నేతలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం లేఖ రాశారు.

ఢిల్లీలో ఉన్నతాధికారుల బదిలీ, నియామకానికి సంబంధించిన అధికారాన్ని కేంద్రానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ ఆర్డినెన్స్ పార్లమెంటులో ఆమోదం పొందితే ఢిల్లీ రాష్ట్రానికే కాదు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపైనా ఇలాంటి ఆధిపత్యమే చెలాయించే ప్రమాదం ఉందన్నారు. దీనిపై విపక్ష పార్టీలన్నీ తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.

గవర్నర్ల పాలన వస్తుంది..

ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కేంద్రం భంగం కలిగిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నేరుగా నియంత్రిస్తారని, రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఒక్కొక్కటిగా నిర్మూలించబడుతుందని హెచ్చరించారు. ఈ ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశ పెడితే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఢిల్లీలో ప్రజాస్వామ్యం అంతమవుతుందని, ఢిల్లీ ప్రజలకు తాము కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలక పార్టీతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీని నేరుగా పాలిస్తుందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రను అడ్డుకోకుంటే క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్యం అంతమవుతుందని, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల ద్వారా ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలను నేరుగా పాలిస్తారని హెచ్చరించారు.


Similar News