లోక్ సభలోకి ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి

ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది.

Update: 2023-08-01 15:04 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. మణిపూర్‌లో పరిస్థితిపై విపక్షాల నిరసనల నడుమ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం మధ్యాహ్నం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టే సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీకి సంబంధించి ఏదైనా చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 249 పార్లమెంటుకు అన్ని హక్కులు ఇచ్చిందన్నారు. ఢిల్లీకి సంబంధించి పార్లమెంటు ఏదైనా చట్టాన్ని రూపొందించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ బిల్లు విషయంలో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ కేంద్రానికి మద్దతు ప్రకటించింది.

ఇక ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. రూల్ 72 ప్రకారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. ఈ బిల్లు మన దేశపు సహకార సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి, లెఫ్టినెంట్ గవర్నర్ శక్తిని పెంచేంత నిరంకుశంగా ఉందని మండిపడ్డారు. “ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆర్టికల్ 123ని ఉల్లంఘించేలా ఉంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాను. అధికార విభజన సిద్ధాంతానికి ఇది తూట్లు పొడుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాన్ని పూర్తిగా హరించేలా అది ఉంది" అని మజ్లిస్ చీఫ్ అససుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఆమోదం పొందిన బిల్లులు ఇవే..

సముద్రాల్లో దాగి ఉన్న అపార ఖనిజ వనరులను వెలికితీసేందుకు మార్గం సుగమం చేసే కీలక బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్- 2002కి సంబంధించిన సవరణ బిల్లుకు అప్రూవల్ లభించింది. మధ్యవర్తిత్వ బిల్లు-2021కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. వివాదాల పరిష్కారానికి, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడానికి, మధ్యవర్తుల నమోదుకు, సమాజ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించేలా ఈ బిల్లులో సవరణలు చేశారు. ఆన్‌లైన్ మధ్యవర్తిత్వం కూడా తక్కువ ఖర్చుతో జరిగేలా ఇందులో నిబంధనలు చేర్చారు. మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ (సవరణ) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించింది.

జనన మరణాల నమోదు (సవరణ) బిల్లుకు లోక్‌సభలో అప్రూవల్ లభించింది. ఈ బిల్లులకు ఆమోదం మినహా ప్రజాప్రయోజనకర చర్చ జరగకుండానే మంగళవారం మరోసారి ఉభయ సభలు వాయిదాపడ్డాయి. ఇక మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8, 9, 10 తేదీల్లో లోక్‌సభ లో చర్చ జరిగే అవకాశం ఉందని తెలిసింది. "ఇండియా" కూటమి తరఫున మణిపూర్ సమస్యపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. అయితే ఇంకా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.


Similar News