Delhi LG: ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు భారీ ఊరట
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు భారీ ఊరట లభించింది. వీకే సక్సేనాపై వేసిన పరువునష్టం కేసులో అదనపు సాక్షిని విచారించాలని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ దాఖలు చేసిన దరఖాస్తుని తోసిపుచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు భారీ ఊరట లభించింది. వీకే సక్సేనాపై వేసిన పరువునష్టం కేసులో అదనపు సాక్షిని విచారించాలని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ దాఖలు చేసిన దరఖాస్తుని తోసిపుచ్చింది. విచారణ ఆలస్యం చేయాడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని ఆరోపించింది. మేధా పాట్కర్, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. తనతోపాటు ‘నర్మదా బచావో ఆందోళన్’కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై సక్సేనాపై ఆమె అప్పట్లో కేసు వేశారు. ఆ సమయంలో ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. మరోవైపు.. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై ఆయన సైతం 2001లో రెండు కేసులు దాఖలు చేశారు.
సాక్షి ఇప్పుడే బయటపడిందా?
అయితే, మేధా పాట్కర్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ఆమెను మందలించారు. సాక్షులందరినీ విచారించిన తర్వాత ఈ సాక్షి ఇప్పుడే బయటపడటం అభ్యర్థన నిజాయితీపై తీవ్ర సందేహాన్ని లేవనెత్తుతుందన్నారు. ప్రస్తుత కేసు 24 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని.. సాక్షులను ఇప్పటికే విచారించారని చెప్పకొచ్చారు. గతంలో కూడా పాట్కర్ ఓ దరఖాస్తుని దాఖలు చేసిందని.. అయితే, అదుంలో కొత్త సాక్షిని చేర్చలేదని గుర్తుచేసింది. 24 ఏళ్ల విచారణలో ఒక్కసారి కూడా ఈ సాక్షి గురించి ప్రస్తవించకపోవడం గమనార్హమని చెప్పుకొచ్చింది. బహుశా కేసును కృత్రిమంగా బలోపేతం చేయడానికి సాక్షిని ప్రవేశపెట్టారని కోర్టు మండపిడింది.