ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ: తాజా నివేదికలో షాకింగ్ విషయాలు
ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది. 2023లో ఢిల్లీలో గాలి నాణ్యత క్యూబిక్ మీటర్‌కు సగటున 92.7 మైక్రో గ్రాములకు దిగజారింది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది. 2023లో ఢిల్లీలో గాలి నాణ్యత క్యూబిక్ మీటర్‌కు సగటున 92.7 మైక్రో గ్రాములకు దిగజారింది. ఇది 2022లో క్యూబిక్ మీటరుకు 89.1 మైక్రోగ్రాములుగా ఉంది. స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇక, ప్రపంచంలోనే మూడో అత్యంత కాలుష్య దేశంగా భారత్ అవతరించింది. మొదటి రెండు దేశాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు ఉండగా..పాక్‌లో క్యూబిక్ మీటర్‌కు 73.7 మైక్రో గ్రాములుగా ఉంది. ఈ ర్యాంకింగ్‌లో భారత్ గతేడాది ఎనిమిదో స్థానంలో ఉంది.
అత్యంత కాలుష్య పట్టణంగా బెగూసరాయ్
ఈ నివేదికలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా బిహార్‌లోని బెగూసరాయ్ నిలిచింది. బెగూసరాయ్‌లో గాలినాణ్యత క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. కాగా, 2022లో 131 దేశాల్లోని 7,323 ప్రాంతాల్లో సర్వే చేపట్టి డేటా సేకరించగా..2023లో 134 దేశాల్లోని 7,812 చోట్ల సర్వే నిర్వహించినట్టు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ సంస్థ తెలిపింది. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర పరిశోధనా సంస్థలు రూపొందించిన డేటాను సైతం పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది.
మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!
మానవ ఆరోగ్యానికి రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం తీవ్ర ముప్పుగా పరిణమించింది. ప్రతి తొమ్మిది మరణాలలో ఒకరు వాయు కాలుష్యం కారణంగా మృతి చెందుతున్నట్టు పలు నివేదకలు తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఏడు మిలియన్ల మంది కాలుష్యం భారిన పడుతున్నట్టు అంచనా వేస్తోంది. దీని కారణంగా ఆస్తమా, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తున్నట్టు పేర్కొంది.