Delhi : ఢిల్లీ మౌలిక సదుపాయాలపై సమీక్షకు కమిటీ.. హైకోర్టు కీలక నిర్ణయం

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ప్రాంతం విషయంపై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-02 17:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ప్రాంతం విషయంపై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని పాలనాపరమైన, ఆర్థికపరమైన, మౌలిక సదుపాయాల పరమైన అంశాలపై సమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్‌సీటీడీ) చీఫ్ సెక్రెటరీ సారథ్యం వహిస్తారని వెల్లడించింది. సభ్యులుగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఉంటారని తెలిపింది. 8 వారాల్లోగా అధ్యయన నివేదికను సమర్పించాలని ఈ కమిటీకి హైకోర్టు నిర్దేశించింది.

‘‘గత కొన్ని నెలలుగా ఢిల్లీలో కొత్త అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం లభించడం పెద్ద సవాల్‌గా మారింది. క్యాబినెట్ సమావేశాలు జరగడం లేదు. తదుపరి క్యాబినెట్ భేటీ ఎప్పుడు జరుగుతుందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు’’ అని ఈసందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఢిల్లీ అడ్మినిస్ట్రేటర్ల ఆలోచనా ధోరణి మారాలి. ప్రతీది ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన సరికాదు’’ అని సూచించింది. ‘‘ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనల విషయంలో మేం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ పాలక సంస్థలు పాటించలేదు. దేశ రాజధాని ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలకు ఎవరు కారణమని ప్రశ్నిస్తే.. ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు. సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించడంపై మాత్రం ధ్యాస పెట్టడం లేదు’’ అని హైకోర్టు బెంచ్ పేర్కొంది.

Tags:    

Similar News