కేజ్రీవాల్‌ బెయిల్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ కోర్టు.. జూన్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ

జైలు అధికారులు కేజ్రీవాల్‌కు కావాల్సిన వైద్య అవసరాలను చూసుకోవాలని పేర్కొంది.

Update: 2024-06-05 11:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. వైద్యపరమైన కారణాలతో ఏడు రోజులపాటు బెయిల్ కోసం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అందుకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దానిపై వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. తాజాగా దాన్ని తిరస్కరిస్తూ.. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. జైలు అధికారులు కేజ్రీవాల్‌కు కావాల్సిన వైద్య అవసరాలను చూసుకోవాలని పేర్కొంది. మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ ఈ ఏడాది మార్చి 21న అరెస్ట్ అయ్యారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ విచారణ ఆలస్యం కావడంతో ఎన్నికల ప్రచారానికి మధ్యంతర బెయిల్ కోరారు. షరతులతో కూడిన మద్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు జూన్ 2న తిరిగి జైల్లో లొంగిపోవాలని పేర్కొంది.


Similar News