Defence Ministry: రూ.1.45 లక్షల కోట్ల ఆయుధాల కొనుగోలు.. ఆమోదం తెలిపిన రక్షణ శాఖ

దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను విలువైన ఆయుధాల కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.

Update: 2024-09-03 13:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను విలువైన ఆయుధాల కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. రూ.1,44,716 కోట్ల విలువైన పలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రక్షణ శాఖ ఆమోదం తెలిపిన వాటిలో ప్రదానంగా ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్, ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లు, డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ అండ్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెస్సెల్స్‌తో సహా తదితర ఆయుధాలు ఉన్నాయి. వీటిలో 99 శాతం దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసినవే ఉన్నట్టు తెలుస్తోంది.

భారత సైన్యంలోని ట్యాంక్ ప్లీట్ ఆధునీకరణ కోసం.. ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఎఫ్ఆర్‌సీవీఎస్) కొనుగోలు ప్రతిపాదనకు సైతం రక్షణ శాఖ అనుమతి లభించింది. అలాగే ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్‌ల సేకరణకు కూడా అనుమతిచ్చామని, ఇది వైమానిక లక్ష్యాన్ని గుర్తించి ట్రాక్ చేయడంతో పాటు ఫైరింగ్ పరిష్కారాలను అందిస్తుందని పేర్కొంది. ఈ పరికరాన్ని ఆర్మర్డ్ వెహికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసింది. అంతేగాక ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను పెంపొందించేందుకు సైతం మూడు ప్రాజెక్టులకు డీఏసీ ఆమోదించింది. సమావేశం ముగింపు అనంతరం ఇటీవల గుండెపోటుతో మరణించిన డీఏసీ సభ్యుడు ఐసీజీ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్‌కు రాజ్‌నాథ్ సింగ్ మౌనం పాటించారని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.


Similar News