Nepal Road Accident: నేపాల్ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరింది. నేపాల్ లో శుక్రవారం ఉత్తరప్రదేశ్ వాసులతో ఉన్న పర్యాటక బస్సు నదిలోకి దూసుకెళ్లింది.

Update: 2024-08-24 04:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరింది. నేపాల్ లో శుక్రవారం ఉత్తరప్రదేశ్ వాసులతో ఉన్న పర్యాటక బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన పర్యటక బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా 43 మంది నేపాల్‌లోని పొఖారా నుంచి కాట్మండూకు బయలుదేరారు. తనహూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో వెళుతుండగా వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కన 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు.

ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా డెడ్ బాడీల తరలింపు

మృతుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర వాసులే ఉన్నారు. మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి ఎయిర్‌ఫోర్స్‌ విమానం నేపాల్‌ వెళ్లనుంది. మృతదేహాలన్నింటినీ భారత వైమానిక దళ విమానం ద్వారా మహారాష్ట్రకు తీసుకువెళతారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. కేంద్రహోంమంత్రి అమిత్ షా సహా ఇతర అధికారులతో మాట్లాడారు. హోంమంత్రి జోక్యంతో ఇప్పుడు భారత వాయుసేన విమానం కోసం ఏర్పాట్లు చేశామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. శనివారం మృతదేహాలను ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్రకు తీసుకువెళతామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతులందరూ మహారాష్ట్రలోని జల్గావ్ కు చెందినవారని పేర్కొంది. అయితే, వాణిజ్య విమానాల ద్వారా మహారాష్ట్రకు డెడ్ బాడీలను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని మహారాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కేంద్రానికి లేఖ రాశారు. అందుకే ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా గోరఖ్ పూర్ నుంచి నాసిక్ కు డెడ్ బాడీలను తరలించనున్నారు.


Similar News