షాకింగ్ న్యూస్.. అంగన్ వాడీ మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము
అంగన్ వాడీ మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము కలకలం రేపింది.
దిశ, డైనమిక్ బ్యూరో: చిన్నారులకు అంగన్ వాడీ సెంటర్ లో అందించే మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా పాలస్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అంగన్‌వాడీ సెంటర్లలో ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా పప్పు ఖిచడి ప్రీమిక్స్ ప్యాకెట్లు అందిస్తుంటారు. ఈ క్రమంలో గత సోమవారం పాలూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు భోజన ప్యాకెట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. తమ పిల్లలకు అందిన ప్యాకెట్‌లో చనిపోయిన పాము కనిపించిందని పిల్లల్లో ఒకరి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పేరెంట్స్ ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర అంగన్ వాడీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఆనంది బోసలే చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో సాంగ్లి జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సందీప్ యాదవ్, ఆహార భద్రతా కమిటీ అధికారులు అంగన్‌వాడీలను సందర్శించారు. అక్కడి ఫూడ్ ప్యాకెట్‌ను ల్యాబ్ పరీక్షల నిమిత్తం తరలించినట్లు ఆనంది బోసలే తెలిపారు. అయితే ఈ ఘటనను అధికారులు ఇంకా ధృవీకరించలేదని జాతీయ మీడియా పేర్కొంది.