CJI : సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోడీ హాజరుపై వివాదం.. జస్టిస్ చంద్రచూడ్‌ రియాక్షన్‌

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI) నివాసంలో గత నెలలో జరిగిన గణపతి పూజ(Ganesh Puja) కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) హాజరవడంపై రాజకీయ వివాదం రేగుతోంది.

Update: 2024-10-28 13:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI) నివాసంలో గత నెలలో జరిగిన గణపతి పూజ(Ganesh Puja) కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) హాజరవడంపై రాజకీయ వివాదం రేగుతోంది. దీంతో ఈ అంశంపై సీజేఐ స్పందించారు. ఆ సమావేశంలో న్యాయపరమైన అంశాలేవీ తాము చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సమావేశాలు నిర్వహించడం అనేది సర్వసాధారణ అంశమన్నారు. ముంబైలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఈవివరాలను వెల్లడించారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయి. వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సమావేశమవుతుంటారు. ఈ సమావేశాలను చూసి.. ఇద్దరి మధ్య ఏదో డీల్‌ కుదిరినట్టుగా భావించరాదు’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ‘‘ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మా విధులు మాకు తెలుసు. రాజకీయ నాయకులకు వారి విధులు తెలుసు. ఏ న్యాయమూర్తులు కూడా ముప్పును కోరి తెచ్చుకోరు. మనదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది’’ అని ఆయన తేల్చి చెప్పారు.

న్యాయవ్యవస్థ కోసమే ఆ సమావేశాలు

‘‘మనదేశ రాజకీయ వర్గాల్లోనూ న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవభావం ఉంది. ఇది మన రాజకీయ వ్యవస్థ పరిపక్వతకు నిదర్శనం’’ అని సీజేఐ చెప్పారు. ‘‘న్యాయవ్యవస్థకు కావాల్సిన నిధులను ప్రభుత్వాలు విడుదల చేస్తుంటాయి. అందుకే సీఎంలతో ప్రధాన న్యాయమూర్తుల స్థాయి వారికి సమావేశాలు తప్పనిసరి. ఇలాంటి సమావేశాలు న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తాయి’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ వివరించారు. ‘‘నేను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాను. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు వారు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఇంటికి ముఖ్యమంత్రి వస్తారు. ఈ సమావేశాలు ఎజెండాను నిర్ణయిస్తాయి. న్యాయవ్యవస్థకు అవసరమైన నిధుల కోసం ప్రధాన న్యాయమూర్తులు లేఖలను పంపి ఊరుకుంటే పనులు కావు. అందుకే నేరుగా కలిసి మాట్లాడాల్సి ఉంటుంది’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

Tags:    

Similar News