ఢిల్లీ మంత్రిని ప్రశ్నించిన ఈడీ.. దేనిపైనో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి కైలాశ్ గెహ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం విచారించారు. ఢిల్లీలోని నజఫ్‌గర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కైలాశ్ గెహ్లాట్.. ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించిన ప్యానల్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఈ పాలసీని అప్పట్లోనే రద్దు చేసినప్పటికీ.. దాని రూపకల్పన క్రమంలో భారీ అవినీతి జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ స్కాంతో ఏమైనా సంబంధం ఉందా ? లేదా ? అనే కోణంలో కైలాశ్ గెహ్లాట్‌ను అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీని రూపొందించే టైంలో ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్.. కైలాశ్ గెహ్లాట్ ఇంట్లోనే ఉండేవారని ఈడీ ఆరోపిస్తోంది. కైలాశ్ పదేపదే మొబైల్ నంబర్స్ మార్చడంపైనా అనుమానం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో దాదాపు 5 గంటలపాటు మంత్రి కైలాశ్ గెహ్లాట్‌ను ప్రశ్నించారు.
కైలాశ్ మీడియాతో మాట్లాడుతూ..
విచారణ అనంతరం కైలాశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను జవాబు ఇచ్చినట్లు తెలిపారు. గోవా ఎన్నికల్లో తాను ఎప్పుడూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. తనకు ప్రభుత్వ బంగ్లా కేటాయించినా.. వసంత్‌కుంజ్‌లోని ప్రైవేట్ నివాసంలోనే ఉంటున్నట్లు చెప్పారు. ఈడీ అధికారులు తనకు ఎలాంటి క్రాస్ క్వశ్చన్లు వేయలేదన్నారు. ఈడీ గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసిందని.. అప్పట్లో అసెంబ్లీ సమావేశాలు జరగడం వల్ల కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు కైలాశ్ చెప్పారు. తాజా నోటీసుల నేపథ్యంలో శనివారం ఈడీ విచారణకు హాజరయ్యానని పేర్కొన్నారు.